బెలారస్‌కు అణ్వాయుధాలు: పుతిన్ సంచలనం, జపాన్‌పై అమెరికా వేసిన వాటికంటే పవర్ఫుల్

మాస్కో: ఉక్రెయిన్‌తో దాడులు కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. బెలారస్‌కు మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను తరలించామని పుతిన్ తెలిపారు.

వేసవి చివరి కల్లా మిగితా వాటిని కూడా తరలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదురుదాడికి పాల్పడుతున్న క్రమంలో పుతిన్ చేసిన ఈ అణ్వాయుధాల ప్రకటన సంచలనంగా మారింది.

వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించడం జూన్ నెల చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపులు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. బెలారస్ రష్యాకు కీలకమైన మిత్ర దేశంగా ఉన్న విషయం తెలిసిందే.

గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రకు లాంచ్ ప్యాడ్‌గా బెలారస్ పనిచేయడం గమనార్హం. కాగా, టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను.. యుద్ధభూమిలో శత్రు దళాలను, వారి ఆయుధాలను నాశనం చేయడానికి ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్‌లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన క్షిపణులు, బాంబులు తరలించినట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ధృవీకరించారు. ఈ అణ్వాయుధాలను హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధిక శక్తివంతమైనవని తెలిపారు. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని చాలా నగరాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Posted Under AP
YES9 TV