ఎక్లాట్‌ మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు

ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ (ఎక్లాట్‌) తెలంగాణలో తన గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్‌ ఇప్పటికే కరీంనగర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ సెంటర్‌లో 300 మంది చొప్పున, హైదరాబాద్‌లో 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఎక్లాట్‌ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఎక్లాట్‌కు అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ కోసం తాము తెలంగాణ ఏఐ మిషన్‌తోనూ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎక్లాట్‌ సీఈఓ కార్తీక్‌ పోల్సాని, సీఓఓ స్నేహా పోల్సాని తెలిపారు. ఇదిలా ఉంటే 2016లో తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇప్పటికే కరీంనగర్‌లో 200 మెడికల్‌ కోడిం గ్, టెక్నాలజీ ఉద్యోగాలను ఎక్లాట్‌ సృష్టించింది.

YES9 TV