ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం.. ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. గతానికి భిన్నంగా వార్నింగులు కాకుండా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా నుంచి పథకాల వరకూ అన్ని అస్త్రాలను పట్టుకుని నెలకు 20 రోజులు జనాల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు ఉపదేశించారు సీఎం జగన్.
ఎమ్మెల్యే అయినా.. కార్యకర్త అయినా నాకు అత్యంత కీలకం.. మీతో ఉన్నది రాజకీయ బంధం కాదు.. మానవ సంబంధం అంటూనే గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వాపు మాత్రమే.. ప్రత్యర్ధులు బలుపు అనుకుంటున్నారని దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు సీఎం జగన్.
ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశామన్నారు సీఎం జగన్. దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చిందని.. మార్చి 16వరకూ కోడ్ కొనసాగిందన్నారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయన్నారు. దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందని. మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ టూరు తర్వాత సీఎం జగన్ తన పార్టీ కేడర్‌ను అలర్ట్ చేస్తున్న సమయంలోనే.. హస్తినకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటన ఆసక్తిగా మారింది. బీజేపీతో బంధం ఉన్నట్టా? లేనట్టా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌ను కలవడం ఆసక్తిగా మారింది.
