భారత వైమానిక దళం పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వైమానిక పోరాట విన్యాసాలకు సిద్ధమవుతోంది. తాజాగా జారీ చేసిన NOTAM ప్రకారం.. జైసల్మేర్, ఫలోడి, బికనీర్, జోధ్‌పూర్ ప్రాంతాలకు సమీపంలోని విస్తృత గగనతలాన్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రత్యేక కార్యకలాపాల కోసం రిజర్వ్ చేశారు. ఇందులోని కొన్ని ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నట్లు సమాచారం. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు దాదాపు 40,000 అడుగుల ఎత్తు వరకు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 9 నుంచి 21 వరకు జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో భారత్-జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు ‘వీర్ గార్డియన్ 26’ జరగనున్నాయి. జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన మూడు F-2A యుద్ధ విమానాలతో పాటు సుమారు 110 మంది సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. జపాన్ F-2A యుద్ధ విమానాలు భారత వైమానిక స్థావరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ గగనతల పోరాట శిక్షణలో పాల్గొనడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
మరోవైపు ‘వీర్ గార్డియన్ 26’ ముగిసిన వెంటనే ‘తరంగ్ శక్తి 2026’ బహుళజాతి వైమానిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు జోధ్‌పూర్‌లో జరిగే ఈ విన్యాసాల్లో పలు దేశాల వైమానిక దళాలు పాల్గొనే అవకాశం ఉంది. సంక్లిష్టమైన వైమానిక కార్యకలాపాలు, పరస్పర సమన్వయం, సంయుక్త ఆపరేషన్ల సామర్థ్యాల పెంపుపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వరుసగా జరుగుతున్న ఈ భారీ విన్యాసాలతో పశ్చిమ భారతదేశంలోని వైమానిక కార్యకలాపాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
