భారత్‌కు పెరుగుతున్న ముప్పు.. 80 శాతం మందిపై వాతావరణ విపత్తుల ప్రభావం!

భూమి వేడెక్కుతున్న కొద్దీ వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనూహ్య వర్షాలు, వరదలు, కరువులు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు మానవాళికి సవాల్‌గా మారుతున్నాయి. పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంతో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఇప్పటికే 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగిన నేపథ్యంలో.. భవిష్యత్తులో మరిన్ని విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన ‘లిమిటింగ్ ఓవర్‌షూట్’ నివేదికలో భారత్‌కు సంబంధించిన ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలు తీవ్ర ఎండలు, ఆకస్మిక వరదలు, కరువులు, తుఫానులు వంటి వాతావరణ ఆధారిత విపత్తులకు గురయ్యే జిల్లాల్లోనే నివసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లో కోట్లాది మంది ప్రజల జీవన విధానంపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2026లో వెలువడిన తాజా పరిశోధనల ప్రకారం.. 1981 నుంచి 2020 మధ్యకాలంలో భారత్‌లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు ఒక డిగ్రీ సెల్సియస్‌ పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే కొద్దీ హీట్‌వేవ్‌లు, భారీ వర్షాలు, వరదలు, కరువులు వంటి విపత్తుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కర్బన ఉద్గారాలను నియంత్రించడంతో పాటు, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Editor