అమెరికా-కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ‘శత్రువు’గా చిత్రీకరించడం కెనడా రాజకీయాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
గురువారం ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు చేశారు. కెనడా రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రధాని మార్క్ కార్నీ.. తనను ‘శత్రువు’గా చూపించడం కెనడా రాజకీయాలకు భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని ఆయన హెచ్చరించారు.
కెనడా రాజకీయ నాయకులు ఇప్పటివరకు ఎదుర్కొన్న పరిణామాలన్నింటికంటే ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉండబోతోందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ‘‘వేచి చూడండి’’ అంటూ హెచ్చరిక జారీ చేశారు. అమెరికా-కెనడా మధ్య సుంకాలు, వాణిజ్య విధానాలపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.
