తాడిమర్రి( yes9tv )మొహరం అగ్నిగుండాలకు పచ్చని చెట్ల నరికివేతకు అడ్డుకట్ట ఎండుకట్టెలు, కంపకట్టలతోనే అగ్నిగుండాలు వెలిగించాలి – అటవీశాఖ హెచ్చరిక

తాడిమర్రి, జూన్ 16: రాబోయే మొహరం ఉత్సవాల సందర్భంగా అగ్నిగుండాల కోసం పచ్చని చెట్లను నరికివేయకుండా ఎండిన కట్టెలు, కంపకట్టలను మాత్రమే వినియోగించాలని అటవీశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల, చిలకొండయ్యపల్లి, దాడితోట గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారి టి. చక్రపాణి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామాలను సందర్శించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
మొహరం ఉత్సవాల్లో అగ్నిగుండం సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే పచ్చని చెట్లను నరకకుండా ప్రత్యామ్నాయంగా ఎండుకట్టెలు, కంపకట్టలను వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమని, పచ్చదనాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అధికారులు మాట్లాడుతూ మొహరం ఉత్సవాలు భక్తుల విశ్వాసాలకు, సంప్రదాయాలకు ప్రతీకలని, అయితే వాటి నిర్వహణ వల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చని చెట్ల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాలంటే చెట్ల సంరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.
అటవీ చట్టాలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ, పచ్చని చెట్లను నరికినట్లు గుర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలు, మత సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, అదే సమయంలో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో దాడితోట పంచాయతీ కార్యదర్శి హరీష్, చిలకొండయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటరమనప్ప, మహిళా పోలీసు మీనకుమారి, ఉపాధి హామీ పథకం సాంకేతిక అధికారి సుధీర్, తాడిమర్రి పోలీసు సిబ్బంది జగదీష్, సతీష్ కుమార్, అటవీశాఖ సిబ్బంది వెంకటరమణ, గిరీష్ తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
అటవీశాఖ అధికారులు మొహరం ఉత్సవాలను శాంతియుతంగా, పర్యావరణ హితంగా నిర్వహించి పచ్చదన పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Posted Under AP
Editor