రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన యోగాంధ్ర విజేతలు
అనంతపురం, జూన్ 17:
యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన 18 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బుధవారం సాయంత్రం అనంతపురం నుంచి విజయవాడకు బయలుదేరారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 9 మంది బాలురు, 9 మంది బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి విజేతలను అభినందించి, ప్రత్యేక బస్సుకు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
విజేతల బృందం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుండాలపల్లి గ్రామంలోని డాన్ బాస్కో పాఠశాలలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుంది. సోలో యోగాసనాలు, ప్రాణాయామం, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా సాంగ్, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ, యోగా వ్యాసరచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 10–18 సంవత్సరాలు, 19–35 సంవత్సరాలు, 36 సంవత్సరాలు పైబడిన వారు అనే మూడు విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కాంపిటీషన్స్ నోడల్ ఆఫీసర్, ఆయుష్ శాఖ యోగా ఇన్‌స్పెక్టర్ డా. రామ్‌కుమార్ ఆధ్వర్యంలో బృందం రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రయాణించింది. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డా. తిరుపతి రెడ్డి, డా. రఫిక్, ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన యోగాంధ్ర విజేతలు..
