భారతదేశానికి సహజ వ్యవసాయ నమూనాగా అనంతపురం నిలవగలదు
జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ లక్ష్యం – కలెక్టర్ ఓ. ఆనంద్
సహజ వ్యవసాయ విస్తరణకు చెట్ల పెంపకం అవసరం – అటవీ శాఖ సంరక్షకురాలు యశోదాబాయి
రాయలసీమలోని అనంతపురం జిల్లా సహజ వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచే సామర్థ్యం కలిగి ఉందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవం-2026 సందర్భంగా యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ (AF-EC) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో ప్రస్తుతం 85 వేల ఎకరాల్లో సాగుతున్న సహజ వ్యవసాయాన్ని వచ్చే ఏడాదికి 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) కార్యక్రమాన్ని 2 లక్షల ఎకరాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అదనంగా 35 వేల ఎకరాల బంజరు భూమిని సాగులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ స్టాళ్లు, నమూనా ఫారం పాండ్లను కలెక్టర్ సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డా. వై.వి. మల్లారెడ్డి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 12 గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నామని, మరింత మంది రైతులు ఈ పద్ధతులను అనుసరించాలని కోరారు.
సదస్సులో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ నమూనాలు, సహజ వ్యవసాయ విధానాలు, విత్తన బంతుల తయారీ, రైతులకు ఉపయోగపడే పరికరాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు.
అటవీ శాఖ సంరక్షకురాలు ఆర్. యశోదాబాయి మాట్లాడుతూ, సహజ వ్యవసాయానికి చెట్లు కీలకమని, రైతులు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. జూలై 1 నుంచి నాటేందుకు అటవీ శాఖ 10 లక్షల మొక్కలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వేప, కానుగ వంటి చెట్లు లేకుండా జీవ ఎరువులు, జీవ పురుగుమందుల తయారీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సహజ వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు తమ విజయగాథలను వీడియోల ద్వారా పంచుకున్నారు. అలాగే వాటర్‌షెడ్ కార్యక్రమాల వల్ల గ్రామాల్లో వచ్చిన మార్పులను రైతులు వివరించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ ఫారెస్ట్రీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. సాలు రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. రఘునాథ రెడ్డి, నాబార్డ్ డీడీఎం కె. అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
