అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్..

అనంతపురం జిల్లా కలెక్టరేట్

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆర్&బి, పంచాయతీరాజ్ తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్&బి శాఖ పరిధిలోని వంతెనల నిర్మాణ పనుల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంటూ, టెండర్ దశలో ఉన్నవి, నిర్మాణంలో ఉన్నవి సహా అన్ని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
డీఎంఎఫ్ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని సూచించిన కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నాబార్డ్ కింద చేపడుతున్న నాలుగు పనులు, పీఎంజీఎస్‌వై ఫేజ్-3 కింద నిర్మిస్తున్న వంతెనల పనులను గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ టైమ్‌లైన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఆర్&బి ఎస్‌ఈ మురళీకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఆర్&బి ఈఈ రాజగోపాల్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor