అనంతపురము, జూన్ 16 :
భుజం కింది భాగంలో చేయి కోల్పోయిన వికలాంగులకు ఉచితంగా అత్యాధునిక ఎల్‌ఎన్-4 (LN4) ఫంక్షనల్ ప్రోస్థెటిక్ చేతులను అందించే మహత్తర మానవతా కార్యక్రమం “ప్రాజెక్ట్ చేయూత” ను జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అనంతపురము జిల్లా శాఖ అధ్యక్షులు ఓ.ఆనంద్ ప్రారంభించారు.
అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో మంగళవారం ‘దివ్యాంగ’ థీమ్ తో ప్రత్యేక దివ్యాంగ యోగాసన ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల, వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి అర్చన, డి.ఎం.హెచ్.ఓ. డా.ఈబి.దేవి, రెడ్ క్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ & ఓ.ఎస్.డి డా.జి.లక్ష్మణ ప్రసాద్, రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షురాలు మేడా రామలక్ష్మి, రెడ్ క్రాస్ సభ్యులు, రోటరీ మరియు ఇన్నర్ వీల్ ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోటరీ జిల్లా 3150, ఎల్‌ఎన్-4 హ్యాండ్ ప్రాజెక్ట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయి లేదా పైభాగం అవయవాన్ని కోల్పోయిన ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు పూర్తిగా ఉచితంగా ప్రోస్థెటిక్ చేతులు అందించబడనున్నాయి.
ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరాలు క్రింది ప్రాంతాలలో నిర్వహించబడనున్నాయి :
• గుంటూరు – 02 ఆగస్టు 2026
• విజయనగరం – 16 ఆగస్టు 2026
• అనంతపురము – 30 ఆగస్టు 2026
ఈ కార్యక్రమానికి 4 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగి, చేయి లేదా పైభాగం అవయవాన్ని కోల్పోయి కనీసం 4 అంగుళాల మిగిలిన అవయవ భాగం (Residual Stump) కలిగిన వికలాంగులు అర్హులు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ చేయూత ద్వారా అందించే కృత్రిమ చేయి కేవలం ఒక అవయవ ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన యాంత్రిక కదలికలను కూడా అందిస్తుందని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన శిబిరం అనంతపురములో నిర్వహించబడటం వల్ల లబ్ధిదారులకు ప్రయాణ ఖర్చులు మరియు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రాజెక్ట్ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టిన రెడ్ క్రాస్ మరియు రోటరీ సంస్థలను అభినందించారు.
జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లబ్ధిదారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనాన్ని గడపడానికి తోడ్పడుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి వరకు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి అర్హుడైన వికలాంగుడికి చేరేలా అధికారులు, నిర్వాహకులు మరియు మీడియా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల మాట్లాడుతూ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు కూడా అర్హులైన వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధిదారులకు అత్యుత్తమ నాణ్యత గల ఫంక్షనల్ ప్రోస్థెటిక్ చేయి, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అమరిక, రోజువారీ కార్యకలాపాలపై శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు, ఉపాధి అవకాశాల మెరుగుదల, అనంతర సాంకేతిక సహాయం మరియు మార్గదర్శకత్వం అందించబడనున్నాయి. అర్హులైన లబ్ధిదారులు మరిన్ని వివరాలు మరియు నమోదు కోసం ప్రాజెక్ట్ చేయూత హెల్ప్‌లైన్ నంబర్: 8866 306 969 ను సంప్రదించవలసిందిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ & రోటరీ సెంట్రల్ క్లబ్ జిల్లా శాఖ వారు తెలిపారు.
