కళ్యాణదుర్గం, జూన్ 9: తాను పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి కారుతో పాటు మోసానికి ఉపయోగించిన పోలీసు యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల మేరకు, శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్‌కుమార్ (27) జస్ట్‌డయల్ యాప్ ద్వారా కారు యజమాని జి. మనోహర్‌ను సంప్రదించాడు. తాను పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానని చెప్పి, వాట్సాప్ ద్వారా పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటోలను పంపి విశ్వాసం కలిగించాడు.
ఈ క్రమంలో మారుతి సుజుకి డిజైర్ కారు (ఏపీ 39 ఎన్టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకున్న అనిల్‌కుమార్, నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ కారును తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.
విచారణ సందర్భంగా అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం మేరకు సోమవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఎస్డీపీవో పి. రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్ ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్డీపీవో అభినందించారు.
మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులమని చెప్పుకునే వ్యక్తుల వివరాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే వాహనాలు లేదా ఇతర విలువైన వస్తువులను అప్పగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
