ఆలూరులో వామపక్షాల భారీ ఆందోళన: పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ, సీపీఎం డిమాండ్!

, కర్నూలు జిల్లా ఆలూరులోపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆలూరులో వామపక్షాల ఆందోళన..
–ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్ర విధానాలు: సీపీఐ, సీపీఎం నేతల విమర్శలు..
–ధరల భారం తగ్గించాలి.. అంబేద్కర్ సర్కిల్‌లో వామపక్ష పార్టీల నిరసన…
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆలూరు మండల కేంద్రంలో మంగళవారం సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఎం ప్రాంతీయ కమిటీ నాయకుడు హనుమంతు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై మౌనం పాటించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని, కూలీలు, రైతులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై పడటంతో అన్ని వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను “డబుల్ ఇంజన్ సర్కార్”గా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం విచారకరమని అన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరల పెంపు నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని వామపక్ష నాయకులు ప్రభుత్వాలను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్, సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం తాలూకా కార్యదర్శి చాపల గోపాల్, ఎస్.ఎస్. భాషా, శివ, సీపీఎం నాయకులు కే.పీ. నారాయణస్వామి, కృష్ణ, మైన, విట్టల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు హాజరై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Posted Under AP
Editor