Latest Posts

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్..

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం.

  • క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
  • – రూ.13.20 లక్షల నగదు స్వాధీనం
  • ముగ్గురు అరెస్ట్

హిందూపురం, మే 29:
సత్యసాయి జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై ఉక్కుపాదం మోపారు. హిందూపురం మండల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.13 లక్షల 20 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను హిందూపురం అడిషనల్ ఎస్పీ శ్రీ కె.వి. మహేష్ బాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎన్. సతీష్ కుమార్, IPS ఆదేశాల మేరకు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హిందూపురం రూరల్ యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్ర ఆంజనేయులు ఆధ్వర్యంలో తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం నిర్వహించిన దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అరెస్టైన వారిలో సందీప్ కుమార్ రెడ్డి (32), భీమా రెడ్డి (33), యర్రబల్లి శ్రీనివాసరెడ్డి (37) ఉన్నారు. వీరిపై హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.30/2026 కింద AP Gaming Act ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, జూదం, బైక్ రేసింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని హిందూపురం అడిషనల్ ఎస్పీ శ్రీ కె.వి. మహేష్ సూచించారు. ఇలాంటి కార్యకలాపాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్, మట్కా, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ లేదా ఇతర జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో జరుగుతున్న జూదం, బెట్టింగ్ వంటి కార్యకలాపాలపై డయల్-100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor