Latest Posts

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గ్రామస్థాయిలోనే ‘ప్రజా ఫిర్యాదుల దినోత్సవం’

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

* ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
* ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

ప్రజా సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకంగా “ప్రజా ఫిర్యాదుల దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో వరుసగా రెండవ శుక్రవారం “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి. విష్ణు చరణ్ పాల్గొని ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఒక నెల పాటు ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతి శుక్రవారం అధికార యంత్రాంగం గ్రామానికి వెళ్లి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తోందన్నారు. గత శుక్రవారం జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ తరఫున జాయింట్ కలెక్టర్ హాజరై ప్రజల సమస్యలను స్వీకరించారని వెల్లడించారు.
ఈరోజు మొత్తం 25 ఫిర్యాదులు అందాయని, గతంలో వచ్చిన అర్జీలన్నింటినీ సమీక్షించి పరిష్కారయోగ్యమైన వాటిని నాలుగు వారాల్లో పరిష్కరించాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, ఇంకా రెండు వారాలపాటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రత్యేకంగా రైతులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు లేని గ్రామంగా 74 ఉడేగోళంను తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అందిన 25 అర్జీలకు కూడా కాలపరిమితి నిర్ణయించి, మరో నెల రోజులలోగా వాటిపై చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లా ఇంచార్జి కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నేరుగా గ్రామస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలు ఇచ్చే వినతులను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, రాయదుర్గం తహసీల్దార్ హరికుమార్, ఆయా శాఖల అధికారులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor