శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం: ఫారం పాండ్‌లో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

సత్యసాయి జిల్లా, పెనుగొండ.

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా బయటికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు గ్రామ సమీపంలోని ఫారం పాండ్‌లో మృతి చెందారు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నారి నాగేపల్లి గ్రామంలో జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నారి నాగేపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారుల మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన కల్పన, అజయ్ రెడ్డి దంపతుల కుమారులు సుగుణాకర్ రెడ్డి (12), ధనుష్ రెడ్డి (10) అలాగే శ్రీదేవి కుమారుడు సుదర్శన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం నేరేడు కాయల కోసం గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లారు.నేరేడు కాయలు తిన్న అనంతరం రైతులు వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన ఫారం పాండ్‌లోకి ముగ్గురు చిన్నారులు దిగారు. అయితే ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఘటన సమాచారం అందుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చిన్నారులను బయటికి తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నారుల మృతితో నారి నాగేపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Posted Under AP
Editor