అనంతపురం జిల్లా,కలెక్టరేట్.
- స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు పారదర్శక విధానం
- డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్)
– *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్లను శాస్త్రీయంగా మరియు చట్టబద్ధంగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కట్టుబడి ఉందని డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) పేర్కొన్నారు.*
– *అనంతపురము జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లపై అధ్యయనం మరియు వినతుల స్వీకరణపై సిపిఓ, డిపిఓ, జి.ఎస్.డబ్ల్యు.ఎస్ జిల్లా కోఆర్డినేటర్, మున్సిపల్ కమిషనర్లు, తదితరులతో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బి.సి.ల రిజర్వేషన్ల పై అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) సమీక్ష సమావేశం నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BCs) కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం కోసం జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ పర్యటిస్తూ వినతులను స్వీకరించడం జరుగుతోందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ఈ కమిషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న జనాభా గణాంకాలు, గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం మరియు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జనాభా లెక్కలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వెనుకబడిన తరగతుల విషయంలో క్షేత్రస్థాయి గణాంకాలు మరియు వారి సామాజిక స్థితిగతులపై స్పష్టత అవసరమన్నారు. అధికారుల నుంచి అందుకున్న నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రజల, బీసీ సంఘాల మరియు వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలు అత్యంత కీలకమన్నారు. వివిధ జిల్లాల్లో బహిరంగ విచారణ ద్వారా అభ్యర్థనలు, సూచనలను నేరుగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, గణాంకాలు మరియు వెనుకబాటుతనం ఆధారంగానే నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు.*
– *జిల్లాలో మొత్తం 7,62,462 గృహాలు ఉండగా, అందులో 99.47 శాతం యుఎఫ్ఎస్ (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) సర్వే పూర్తయిందని జిఎస్డబ్ల్యుఎస్ అధికారి తెలిపారు. ఈ సర్వే సంక్షేమ పథకాల కోసం ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం దీని ద్వారా వెనుకబడిన తరగతుల (BC) జనాభా మరియు వారి సామాజిక-ఆర్థిక స్థితిగతుల డేటాను కూడా సేకరిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు రెండు మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి డేటా వివరాలను అందజేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా తయారీకి వీలుగా, సచివాలయాల పరిధిలోని వార్డులను ఎలక్టోరల్ వార్డులతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మ్యాపింగ్ యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని మున్సిపల్ కమిషనర్లను కమిషన్ ఆదేశించింది. గత స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను మరియు ప్రస్తుత రిజర్వేషన్ల అమలును కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన రిపోర్టును వివరించారు.*
– *అనంతరం వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ వినతి పత్రాలను స్వీకరించారు. తదనంతరం డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ కి శాలువా కప్పి నంది విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ బహుకరించారు.*
– *ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్భూకొఠారి, డిపిఓ నాగరాజునాయుడు, జి.ఎస్.డబ్ల్యు.ఎస్ జిల్లా కోఆర్డినేటర్ నాసరరెడ్డి, సిపిఓ అశోక్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.*
