ధర్మవరం నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల అవినీతి ఆరోపణలు – బాధిత రైతుల తరఫున టిడిపి ధర్నా

తాడిమర్రి (yes9tv )ధర్మవరం నియోజకవర్గంలో రెవెన్యూ అధికారుల అవినీతి ఆరోపణలు – బాధిత రైతుల తరఫున టిడిపి ధర్నా
తాడిమర్రి, మే 8: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ, రిజిస్టర్ అయిన భూములను సైతం అక్రమంగా ఇతరుల పేర్లపై నమోదు చేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ ముసుగు శ్రీనివాసులు ఆరోపించారు.
శుక్రవారం బాధిత రైతుల తరఫున తహసీల్దార్ కార్యాలయం ముందు శ్రీ ముసుగు శ్రీనివాసులు, టిడిపి మహిళా నాయకురాలు శ్రీమతి పోట్లమర్రి సీతారామలక్ష్మి తదితరులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం అగ్రహారం గ్రామం సర్వే నంబర్ 527లో 4.50 ఎకరాల భూమిని 1975 సంవత్సరంలో ముసుగు చిన్నప్ప నుండి ముసుగు నారాయణస్వామి కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు.
అయితే భూమి ఆన్‌లైన్ నమోదు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని చిన్నప్ప భార్య రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా తన పేరుమీద నమోదు చేసుకుందని ఆరోపించారు. అనంతరం అదే భూమిని మరొకరికి విక్రయించి అసలు రైతును మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భూమిని తిరిగి తమ పేరుమీద నమోదు చేయించాలని బాధిత రైతు ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేదని, పైగా తహసీల్దార్ రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో అక్రమంగా భూమి కొనుగోలు చేసిన వారి ద్వారా కోర్టులో కేసులు వేయించారని విమర్శించారు.
రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసిపి నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని, టిడిపి నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ తమ పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు.
సదరు భూమిపై కోర్టులో వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ, అక్రమంగా భూమి కొనుగోలు చేసిన వారు పొలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.

Posted Under AP
Editor