మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం..

*హైదరాబాద్,బేగంబజార్.*

  • మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం
  • దుండగుడిని ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. పోలీసులకు నిందితుడి అప్పగింత
  • జాహెర్‌ను గుర్తించి సత్కరించిన సీపీ సజ్జనార్

ప్రాణాలకు తెగించి సాహసం ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. బేగంబజార్ జిన్సీ చౌరహా ప్రాంతంలో ఓ మహిళ తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుండగా రౌడీషీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్కూటీ అదుపు తప్పి దొంగ కిందపడిపోయాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ గమనించాడు.

వెంటనే తన ఆటోను వెనక్కి తిప్పి రౌడీ షీటర్‌ను తన ఆటోతో ఢీకొట్టాడు. దీంతో నిందితుడు కర్రతో జాహెర్‌పై దాడికి ప్రయత్నించాడు. కానీ జాహెర్ ధైర్యంగా రడీ షీటర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. దీంతో సజ్జనార్ ఆటో డ్రైవర్ జాహెర్‌ను సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. దీనికి సంబంధించి సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

“నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీ షీటర్ ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘటించారు” అని కొనియాడారు.

ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జాహెర్ రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించి, నిస్వార్థంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం గోషామహల్ పోలీసులు గాలించారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ను గుర్తించి, అభినందించారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది” అని ప్రశంసించారు.

జాహెర్‌కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్ లాగా ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్‌పూరకు చెందిన రౌడీ షీటర్‌పై గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.

Editor