ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
వారి నుంచి కీలకమైన ఆధారాలు, సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా విజయ్ నాయర్ ని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాము అనుకున్న విధంగా తమ పని పూర్తి కావడం కోసం ప్రభుత్వంలోని పెద్దలకు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధం లేని విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని ఈడీ పసిగట్టింది. అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్.. ఈ ఇద్దరూ కలిసి మద్యం విక్రయాలకు సంబంధించిన హోల్ సేలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వంలోని పెద్దలకు లంచాలు సమర్పించుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ నాయర్ కస్టడీ పిటిషన్ లో పేర్కొంది.
