ముదిగుబ్బ Yes9TV
ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఆర్డీటీ కార్యాలయ కమ్యూనిటీ హాల్‌లో బుధవారం ఆటో డ్రైవర్లకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముదిగుబ్బ ఆఫ్‌గ్రేడ్ సీఐ శివరాముడు, కదిరి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ హనుమంతప్ప, ఏటీఎల్ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, సీఐ శివరాముడు మాట్లాడుతూ, ప్రతి డ్రైవర్ వాహనాన్ని బాధ్యతాయుతంగా నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, వాహనాల సక్రమ నిర్వహణ ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.రోడ్డు ప్రమాదాలపై ప్రాజెక్టర్ ద్వారా స్క్రీన్ పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు.వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి అన్ని రికార్డులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని వివరించారు.
ముదిగుబ్బ సీఐ శివరాముడు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగానే ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు. అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన..
