రైతు లాభదాయకమైన వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు వ్యవసాయంలో రైతుల అవసరాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామంలో మంగళవారం జరిగిన సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే కాలవ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రైతులకు సహాయం పెరిగిందన్నారు. రైతులకు అనేక రూపాల్లో రాయితీలు, ఆర్థిక సహాయం సాంకేతిక సహకారం అందజేయడం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే కాకుండా, పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించనప్పుడు కనీస మద్దతు ధరపై ప్రభుత్వమే కొనుగోళ్లు చేయిస్తోందన్నారు. తద్వారా మార్కెట్లో పోటీ పెరిగి పంట దిగుబడులకు బహిరంగ మార్కెట్లో ధర పెరుగుతోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 42వేల మంది రైతులకు రూ.91.76కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. డ్రిప్ పరికరాలపై రూ.40కోట్ల సబ్సిడీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మరో రూ.30 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ మెరుగుపరచడానికి ఇంకో రూ.85 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి ఇంత భారీ ఎత్తున నిధులు అందుతున్నాయంటే..! చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడమే కారణమన్నారు.
దశాబ్దాలుగా వేరుశనగ పంట ఒక్కటే సాగు చేయడం వల్ల భూసారం తగ్గి దిగుబడులపై ప్రభావం పడుతోందని ఎమ్మెల్యే సూచించారు. రైతులు వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కంది, జొన్న, మొక్కజొన్న, ఉలవ, కొర్ర వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఇప్పటికే రైతుల్లో అవగాహన పెరిగి ఈ దిశగా ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. గుమ్మగట్ట మండలంలో కొందరు రైతులు కొత్తమీర సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. వారి పంట ఉత్పత్తులను బెంగళూరు, శివమొగ్గ ప్రాంత మార్కెట్ కు తరలించి అధిక ఆదాయం పొందుతుండడం శుభ పరిణామమన్నారు. ఇదే
నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు శ్రద్ధ పెట్టే రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సదుపాయాలపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. రైతులు, అధికారులు, వ్యాపారులు సమిష్టిగా పనిచేస్తే… రైతుకు న్యాయమైన ధర లభిస్తుందన్నారు. అప్పుడు వ్యవసాయం తప్పక లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే కాలవ ఆశాభావం వ్యక్తపరిచారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కూటమి ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తూ ఉందన్నారు. రైతు శ్రేయస్సు కోసం ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం వినియోగిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి రైతులు చేదోడు వాదోడుగా ఉంటూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలవ కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాలవ సన్నన్న, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ధానవేంద్ర, కెపి దొడ్డి నాగరాజు, మాజీ కన్వీనర్ కురుబ గిరిమల్లప్ప,గొనభావి రమేష్, సదాశివ, కిందింటి హరినాథ్,గంగాధర్,కాలువ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
