జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

  • జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • రెండు లారీలు ఢీకొనిన ఘట్టన
  • డ్రైవర్ దీక్షిత్ సజీవ దహనం

 

అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం మధ్యానం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
స్థానికుల సమాచారం మేరకు, బళ్లారి–బెంగళూరు 150A జాతీయ రహదారిపై జాజరకల్ టోల్ ప్లాజా దాటిన అనంతరం ఓ సిమెంట్ ట్యాంకర్ పంచర్ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉంది. ఈ సమయంలో రాంపురం వైపు నుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన సిమెంట్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. క్యాబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్ దీక్షిత్ సజీవ దహనమయ్యాడు. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో అక్కడున్న వారు సహాయక చర్యలు చేపట్టలేకపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాద విషయం తెలుసుకున్న రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, డి.హీరేహాళ్ ఎస్‌ఐ గురు ప్రసాద్ రెడ్డి, బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబి రసూల్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor