ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి.

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి పక్షపాతం, జాప్యం లేకుండా విచారణ జరపాలి: ఆర్డీవో వసంత్ బాబు, డీఎస్పీ రవిబాబు

కళ్యాణదుర్గం, జూన్ 6:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో వసంత్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ సబ్-డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో డీఎస్పీ రవిబాబు, ఇన్‌చార్జి డీఎల్డీఓ కొండన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో వసంత్ బాబు మాట్లాడుతూ, పోలీసు మరియు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదైన కేసుల్లో ఆలస్యం లేకుండా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని, ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీలపై ఎక్కడైనా అన్యాయం జరిగినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని డీవీఎంసీ సభ్యులకు సూచించారు. అలాగే మండల, డివిజన్ స్థాయిలో ప్రతి నెలా క్రమం తప్పకుండా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని తెలిపారు.
డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో ఎలాంటి పక్షపాతం లేదా జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కేసులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పటికే నమోదైన అండర్ ట్రయల్ కేసుల పురోగతి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు, డీవీఎంసీ సభ్యులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
డీవీఎంసీ సభ్యుడు మోహన్ మాట్లాడుతూ, గత మూడు నెలల కాలంలో డివిజన్ పరిధిలో 9 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, బాధితుల ఖాతాల్లో రూ.12.55 లక్షల పరిహారం జమ చేసినట్లు వెల్లడించారు. ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మరో సభ్యుడు రామాంజనేయులు మాట్లాడుతూ, గ్రామాల్లో మొహరం పండుగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఏఎస్‌డబ్ల్యూఓ రామ్మోహన్, ఇన్‌చార్జి డీఎల్డీఓ కొండన్న, ఇన్‌చార్జి ఎంపీడీవో రంగనాయకులు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, శాఖల అధికారులు, డీవీఎంసీ సభ్యులు, కళ్యాణదుర్గం ఎంపీపీ మారుతమ్మ, జడ్పీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor