అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
పారదర్శకంగా ఎస్ఐఆర్-2026 అమలు
రాజకీయ పార్టీల సహకారంతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం, జూన్ 6: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర అవగాహన ఉండాలని సూచించారు.
అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2002లో నమోదైన ఓటర్లు, 2025లో ఉన్న ఓటర్లు మరియు వారి పిల్లలకు సంబంధించిన మ్యాపింగ్ పనులు ఇప్పటికే 68 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రక్రియను 90 శాతానికి పైగా పూర్తి చేసేందుకు జూన్ 7 నుంచి 14 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఏలు కూడా భాగస్వాములు కావాలని, రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను సహకరించేందుకు ప్రోత్సహించాలని కోరారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓలు ఇంటింటి సందర్శనలు నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, పూరించిన ఫారాలను తిరిగి స్వీకరిస్తారని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం పరిశీలన పూర్తిచేసి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి పార్టీ తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని సూచించారు. ఈ నెల 10 నుంచి 13 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ్యాపింగ్‌లో గుర్తించబడని ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, సంబంధిత ఓటర్లు వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
సమావేశంలో డీఆర్వో ఏ. మలోల, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
