ఇంధన ధరల పెంపుపై జూన్ 9న రాస్తారోకోను జయప్రదం చేయండి సీపీఎం నేత మల్లికార్జున..

అనంతపూర్ జిల్లా, రాయదుర్గం.

ఇంధన ధరల పెంపుపై జూన్ 9న రాస్తారోకోను జయప్రదం చేయండి సీపీఎం నేత మల్లికార్జున

రాయదుర్గం, జూన్ 6: కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జూన్ 9న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి. మల్లికార్జున పిలుపునిచ్చారు.
శనివారం రాయదుర్గంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మే నెలలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేతివృత్తులు, రవాణా రంగాలపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో మరింతగా ఇంధన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హమని, పెరిగిన ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా జూన్ 9న జరిగే రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నాగరాజు, మధు, తిమ్మరాజు, అంజి, రమేష్, శంకర్, అశోక్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor