అనంతపురం జిల్లా, రాయదుర్గం.
63 ఏళ్ల చెత్తకు శాశ్వత పరిష్కారం..
రాయదుర్గంలో రూ.13 కోట్లతో పారిశుద్ధ్య విప్లవం.
డంపింగ్ యార్డు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
రాయదుర్గం పట్టణ పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం డంపింగ్ యార్డులో జరుగుతున్న చెత్త శుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. రాయదుర్గం డంపింగ్ యార్డులో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిని శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని అధికారులు తెలియజేశారని చెప్పారు.
1963లో రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి సుమారు 63 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తుండటం సంతోషకరమన్నారు. ఈ చెత్త శుద్ధి కార్యక్రమం కోసం సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నుంచి సేకరించే మలినాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసే ప్రత్యేక యూనిట్‌ను రూ.2కోట్లతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ప్రాసెసింగ్ చేసే ఆధునిక వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను మరో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సుమారు రూ.13 కోట్ల వ్యయంతో ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పట్టణం నుంచి వచ్చే చెత్తతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల మలినాలను కూడా ఇక్కడే శుద్ధి చేయడం ద్వారా రాయదుర్గాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిశుభ్రత, ప్రజారోగ్యంపై ఉన్న నిబద్ధతకు ఇవే నిదర్శనమన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రతిరోజూ మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలు నిర్వహిస్తూ చెత్త శుద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. రాయదుర్గం ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
