అనంతపురం జిల్లా, రాయదుర్గం.
బీటీపీ ఆయకట్టుదారులను అభినందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.
వరి సాగులో రికార్డు స్థాయి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలిచిన రైతులను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అభినందించారు. ఆదివారం ఆయన గుమ్మగట్ట మండలం, కలుగోడు గ్రామంలో భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో సాగైన వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పంట పొలాల్లో కలియతిరిగిన ఆయన, వరి సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రైతులు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, కేవలం ఎరువులతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం వల్లే నాణ్యమైన అధిక దిగుబడులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కష్టపడి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ ఏడాది ఆయకట్టుకు సకాలంలో సాగునీరు అందడం వల్ల రైతులు మెరుగైన ఫలితాలు సాధించగలిగారని, సాగునీటి నిర్వహణలో అధికారులు, ఆయకట్టుదారులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కారణంగా ఈసారి రబీ సీజన్‌లో ఎడమ కాలువలకు సాగునీరు విడుదల చేయలేదని, దీనివల్ల కనేకల్లు, బీటీపీ పరిధిలో పండిన పంటకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిందని ఎమ్మెల్యే వివరించారు. స్థానిక వ్యాపారులతో పాటు కర్ణాటక నుంచి కూడా వ్యాపారులు వస్తుండటంతో, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే అధిక ధర లభిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎకరాకు సగటున 45 నుండి 50 బస్తాల దిగుబడి రాగా, కొందరు రైతులు ఏకంగా 63 బస్తాల వరకు దిగుబడి సాధించడం విశేషమన్నారు. పంట నాణ్యత మెరుగ్గా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించి లాభదాయక పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. సక్రమంగా నీటి సరఫరా అందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాలువ సన్నన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, వైస్ చైర్మన్ దానవేంద్ర, కెపి దొడ్డి నాగరాజు మాజీ కన్వీనర్ గిరిమల్లప్ప,బెలోడు సంజీవ మాజీ సర్పంచ్ నాగరాజు, యన్ తిమ్మప్ప కుమార్ రెడ్డి, శ్రీరాములు కాలువ చైర్మన్ కాలువ రాజు, పైదొడ్డి రాజు,మూర్తి అంజి శివరాజు, సదాశివ, మల్లారెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు.
