అనంతపురం జిల్లా,కణేకల్లు.
తుంగభద్ర ఎగువకాలువ రిపేర్లు జూన్ లోపు పూర్తి -ఎమ్మెల్యే కాలవ
తుంగభద్ర ఎగువకాలువ పరిధిలో ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన శాశ్వత, తాత్కాలిక మరమ్మతు పనులను జూన్ నెలాఖరు లోపు పూర్తి చేస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. గురువారం సాయంత్రం కణేకల్లు సమీపంలోని చెరువు వద్ద జరుగుతున్న ఔట్ ఫాల్ రెగ్యూలేటరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడే విలేకర్లతో మాట్లాడారు. కాలువ ద్వారా రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతపురం జిల్లాకు జీవనాడిగా పిలవబడుతున్న తుంగభద్ర ఎగువకాలువ ఆధునీకరణ పనులకు గత ఏడాది ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, వాటిలో చాలావరకు గత ఏడాదే పూర్తి చేయగలిగామని వెల్లడించారు. గత ఏడాది మిగిలిన రూ.7.50 కోట్ల పనులతో పాటు, ప్రస్తుత ఏడాది కొత్తగా మరో రూ.2.40 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. కాలువ 145వ కిలోమీటర్ వద్ద చేపట్టిన అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణంతో పాటు మిగిలిన మరమ్మతు పనులన్నింటినీ జూన్ నెలాఖరు లోపు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే పంట పొలాలకు సకాలంలో సాగునీరు అందించడంతో పాటు, కాలువ ద్వారా అధిక పరిమాణంలో నీటిని తరలించే అవకాశం కలుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను పర్యవేక్షిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, సహకరించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ లకు ప్రజల తరపున ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు.
