గంజాయి రహిత జిల్లా దిశగా అనంత పోలీసుల కీలక ముందడుగు: డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఇకపై గంజాయి టెస్టులు

గంజాయి రహిత జిల్లా కోసం అనంత పోలీసుల కీలక అడుగు. గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు.
డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి సేవనంపై జిల్లావ్యాప్తంగా పోలీసుల టెస్ట్ లు.
ప్రస్తుతం అందుబాటులో వెయ్యి మెడికల్ టెస్ట్ కిట్లు… మరో 10 వేల కిట్లు కోసం ఆర్డర్ పెట్టిన అనంత పోలీస్.
జిల్లా ఎస్పీ పి.జగదీష్.
అనంతపురం. మే 05.
జిల్లా వ్యాప్తంగా ఇకనుండీ డ్రంకన్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు ఉపయోగిస్తున్నామని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పేర్కొన్నారు. గంజాయి అనర్థాలపై ఇది వరకు విద్యాసంస్థలు, కాలనీలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకు రావడం జరిగిందన్నారు. అంతేకాక…గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయడం జరిగిందన్నారు.
మంగళవారం నుండి అనంతపురం జిల్లాలో నూతన సాంకేతికతతో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామన్నారు.వీటి ద్వారా పాజిటివ్‌గా వచ్చిన వారి నుంచి సరఫరా మార్గాలపై కీలక సమాచారం సేకరిస్తామని తెలిపారు. అలాగే, గంజాయి వినియోగ దారుల్లో మార్పు తీసుకు రావడానికి కౌన్సెలింగ్, పునరావాస చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు.

గంజాయి సేవించే అనుమానాస్పద వ్యక్తులు, విద్యా సంస్థలలో గంజాయి వినియోగం గురించి తగిన సమాచారం ఆధారంగా గంజాయి టెస్టులు చేసే విధానాన్ని ప్రవేశ పెట్టనున్నామన్నారు.

పదే పదే టెస్టుల్లో పాజిటివ్‌గా వస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి గంజాయి రహిత అనంతపురం జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor