దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న రాజకీయ వివాదంపై భారతీయ జనతా పార్టీ (BJP) దూకుడు పెంచింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి SIR ప్రక్రియ ప్రాముఖ్యతను, ఎన్నికల సంఘం పారదర్శకతను వివరించనున్నారు.
ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు, అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణ పేరుతో విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఎన్నికల సంఘంపై నిందలు వేస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో నిరసనలతో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు విమర్శించాయి. ఈ విమర్శల వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించి వాస్తవాలను తెలియజేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.
ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వం 24 పేజీల సమగ్ర పత్రాన్ని సిద్ధం చేస్తోంది. SIR ప్రక్రియలోని సాంకేతిక అంశాలు, విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇందులో పొందుపరచనున్నారు. ఈ సమగ్ర పత్రం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కీలక మార్గదర్శకంగా ఉపయోగపడనుంది. ప్రజలతో సమావేశాలు నిర్వహించే సమయంలో, మీడియా చర్చలు మరియు సోషల్ మీడియా వేదికగా తమ వాదనను గట్టిగా వినిపించడానికి ఈ సమాచారాన్ని ఆయుధంగా మలచుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
