Latest Posts

దసరా పండుగ వేళ ప్రయాణికులకు ఊరట: తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు.. విజయవాడ, విశాఖ, పలాస రూట్లలో జనసాధారణ్ సర్వీసులు!

దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, పలాస మార్గాల్లో భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా అన్‌రిజర్వ్‌డ్ జనసాధారణ్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు హైదరాబాద్ (సికింద్రాబాద్, చర్లపల్లి) నుంచి విశాఖపట్నం, చెన్నై, నాగర్‌కోయిల్ ప్రాంతాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
విజయవాడ – విశాఖపట్నం మధ్య అక్టోబర్ 17 (శనివారం), అక్టోబర్ 19 (సోమవారం) తేదీల్లో ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు అక్టోబర్ 17న, విజయవాడ నుంచి బయలుదేరే సర్వీస్ అక్టోబర్ 19న రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయి. అదేవిధంగా విజయవాడ – పలాస మార్గంలో అక్టోబర్ 17, 18 తేదీల్లో విజయవాడ నుంచి పలాసకు.. అక్టోబర్ 18, 19 తేదీల్లో పలాస నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
మరోవైపు సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు (నెం. 07069) అక్టోబర్ 16న రాత్రి 8:15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం – సికింద్రాబాద్ రైలు (నెం. 07070) అక్టోబర్ 17న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, అక్టోబర్ 18న తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులకు సేవలందిస్తాయి.
Posted Under AP
Editor