తాడిమర్రిలో వైభవంగా వాసవి జయంతి వేడుకలు..

తాడిమర్రి ( yes9tv)
ఆర్యవైశ్యుల ఆరాధ్యదేవత వాసవి మాత వాసవి జయంతిని ఆదివారం తాడిమర్రిలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామంలో ఘనంగా ఊరేగింపు చేపట్టారు.
కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు హై స్కూల్ మీదుగా వీరభద్ర స్వామి ఆలయం వరకు కొనసాగింది. అక్కడ కలశాల్లో పవిత్ర జలాన్ని నింపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెయిన్ బజార్ గుండా “జై జై వాసవి మాత” నినాదాలతో ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది.
ఆలయం వద్ద అమ్మవారి విగ్రహానికి కలశ జలాలతో అభిషేకం నిర్వహించి, పంచామృతాభిషేకం చేశారు. పలు రకాల పుష్పాలతో అలంకరించి భక్తులు కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా మండలి, ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor