అనంతపురం జిల్లా, రాయదుర్గం.
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం పునఃప్రారంభించారు. ఈ భవన నిర్మాణాల పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.12 కోట్లు మంజూరు చేయడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయి. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రగతి పండుగ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబులకు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో వారిని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈసందర్భంగా గుమ్మగట్ట మండలం గోనబావిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం ప్రభుత్వం వారికోసం పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, అభివృద్ధి కుంటుపడిందని ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణాలను సైతం పక్కన పెట్టి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టించిన వారికి 2024 ఎన్నికల్లోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రఫా..రఫా అంటూ ఈసారి వస్తే గుంతతీసి భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
వెనుకబడిన రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతాంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాలవ శ్రీనివాసులు కృష్ణా జలాలను భైరవానితిప్ప ప్రాజెక్టుకు తరలించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారని, దీనిని సకాలంలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్రంతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు వంటి విజనరీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఆయన పుట్టినరోజు సందర్భంగా పది రోజుల పాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు వివరించారు. పది రోజులుగా నిర్వహిస్తున్న జన్మదిన వేడుకలు సోమవారంతో ముగియనున్నాయన్నారు. సోమవారం నిర్వహించబోయే చండీదేవి హోమంలో పాల్గొనాలని ప్రజలకు ఎమ్మెల్యే కాలవ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాలవ సన్నన్న, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ యు.హనుమంత రెడ్డి, వైస్ చైర్మన్ మిద్దింటి దానవేంద్ర, యువత కురుబ రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కురుబ గిరిమల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
