ఏపీ కేబినెట్ లో 21 అంశాలపై చర్చ..,!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. నేటి మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.

 

గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునఃపరిశీలిస్తామని చెప్పారు. పరిశీలన తర్వాత ఆయా ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు నేటి మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు. 45 పనులకు రూ.33 వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పారు.

 

బుడమేరు, 10 జిల్లాల్లో వరద ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఆమోదించినట్టు తెలిపారు. రూ.50 వరకు ఉన్న రుణాలపై స్టాంప్ డ్యూటీ మినహాయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రూ.1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపై కూడా నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి వివరించారు.

 

పోలవరం ఎడమ కాలువ రీ-టెండరింగ్ కు ఆమోదం లభించిందని, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి యూనిట్ల స్థాపనకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

 

475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించే పథకానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రలో 1.41 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని వివరించారు.హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పారు. జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి కూడా మంత్రివర్గం అనుమతించిందని అన్నారు.

 

గత ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ నష్టం: మంత్రి పార్ధసారథి

 

గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను నిర్వీర్యం చేసిందని, తాము ఆ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి పార్ధసారథి వివరించారు. గత ప్రభుత్వం చేతకానితనం, దుష్పరిపాలన కారణంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందో చెప్పడానికి ఈ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాహరణ అని అన్నారు.

 

ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు జారీ చేసిందని, కొన్ని చిన్న రాష్ట్రాలు సైతం లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల రూపాయల మేర పనులు చేశాయని వివరించారు. మనకంటే చిన్న రాష్ట్రం కేరళ రూ.70 వేల కోట్ల వరకు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు.

 

కానీ మన రాష్ట్రంలో రూ.26,804 కోట్లకు ప్రతిపాదనలు పంపి, అందులోనూ రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఇలాంటి నష్టాలు కోకొల్లలు అని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రజలు పరిశుభ్రమైన తాగునీటికి దూరమయ్యారని వ్యాఖ్యానించారు.

Posted Under AP
Editor