సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి హవా..

ఏపీలో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి హవా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,149 సాగునీటి సంఘాలకు గాను 5,946 సంఘాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో 95 శాతానికి పైగా అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు అన్ని సంఘాలలో కూటమి నేతలు ఎన్నికయ్యారు. మరో 103 సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

 

కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత సమస్యలు, కూటమి నేతల మధ్య అభిప్రాయాల భేదాలతో పాటు కొన్ని చోట్ల వైసీపీ నేతలు రంగప్రవేశం చేయడంతో పలు ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు పోటీ అనివార్యమయింది. కొన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. శనివారం మొత్తం 6,149 సాగునీటి సంఘాలకు, 49,020 ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సాగునీటి సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.

 

ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మొత్తం 29 సాగునీటి సంఘాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. పలు గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఘర్షణల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఎన్నిక వాయిదా వేశారు.

 

కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో సంతృప్తి స్థాయిలో స్థానాలు దక్కించుకుంది. ఈ మేరకు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో 50 సంఘాల్లో, ఎంపీ సీఎం రమేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 30 సంఘాల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు కొన్ని స్థానాల్లో గెలుపొందారని పార్టీ తెలిపింది.

 

అలానే శ్రీసత్యసాయి, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఒంగోలు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు. అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనూ పలు సంఘాల్లో బీజేపీ నేతలు గెలుపొందారు. పార్టీ తరపున ఎన్నికైన వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభినందించారు. కాగా, సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది.

Posted Under AP
Editor