శ్రీకాకుళంలో జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చెలామణి చేసే రెండు ముఠాలు వేర్వేరుగా పట్టుబడటం, వారి వద్ద పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు లభ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడిన వారి వివరాలను టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం మీడియాకు వివరించారు.

 

ఆంధ్రా – ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద సుమారు రూ.50వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని, అతను చెప్పిన వివరాలతో పలాస, మెళియాపుట్టి, వజ్రకొత్తూరు మండలాలకు చెందిన కుసిరెడ్డి దుర్వాసులు (శంకర్‌రెడ్డి), తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్, దుమ్ము ధర్మారావులను అరెస్టు చేశామని డీఎస్పీ మూర్తి చెప్పారు.

 

వారి నుంచి రూ.57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన కలర్ ప్రింటర్, నాలుగు సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా, ఈ కేసులో 5వ నిందితుడుగా ఉన్న దాసరి రవికుమార్ కరజాడ వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు కావడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది.

 

ద్విచక్రవాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న ఇద్దరిని జి సిగడాం మండలం పెనసాం కూడలి వద్ద పట్టుకున్నట్లు సీఐ అవతారం తెలిపారు. ఎచ్చెర్ల మండలం కొత్తదిబ్బలపాలేనికి చెందిన గనగళ్ల రవి, లావేరుకు చెందిన రాజేశ్‌లు ఒడిశాలోని పర్లాఖెముండి, గుణుపురం ప్రాంతాల నుంచి నకిలీ నోట్లు తెచ్చి చెలామణి చేశారు. ఇబ్బందులు ఏమీ లేకపోవడంతో మరింత సంపాదించాలని నిర్ణయానికి వచ్చి, రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తిలతో కలిసి వ్యాపారం చేశారు.

 

రవి, రాజేశ్ ఇటీవల భద్రాచలం వెళ్లి నోట్ల తయారీకి వినియోగించే రసాయనాలను తెచ్చుకున్నారు. రూ.15 లక్షల నకిలీ నోట్లను విజయనగరం జిల్లా సాలూరు, ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో చెలామణి చేసేందుకు వెళ్తుండగా రవి, రాజేశ్ పోలీసులకు చిక్కారు. ప్రతాపరెడ్డి, కృష్ణమూర్తితో పాటు ఇతర నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు.

Posted Under AP
Editor