సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్లను పెంచామని, ఈరోజు నుంచి దీపం పథకం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తున్నామన్నారు.

 

జగన్‌పై ఆగ్రహం

 

వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్‌కు తమ ప్రభుత్వంపై పోరాడే నైతిక హక్కు లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఇక ఆయన మాటలు జగన్ ఏం నమ్ముతారన్నారు.

 

కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజులు ఏపీలో, ఐదు రోజులు బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.

Posted Under AP
Editor