జగన్ వర్సెస్ షర్మిల ఆస్తుల వివాదం.. కేవీపీ నోరు విప్పుతారా..?

వైఎస్ఆర్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో ఒకొక్కరుగా నోరు విప్పుతున్నారు. షర్మిల లేఖ‌తో వైవీ సుబ్బారెడ్డి బయటకు వచ్చారు. జగన్ మాటలనే ఆయన చెప్పారా? విజయసాయిరెడ్డి అదే బాటలో పయనిస్తారా? మరి కేవీపీ మాటేంటి? ఆయన మౌనమే సమాధానమా? లేక నోరు విప్పుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి వ్యవహారంలో సంబంధమున్న వ్యక్తులు నోరు విప్పుతున్నారు. వైఎస్ షర్మిల.. వైఎస్ అభిమానులకు రాసిన లేఖ ఆధారంగా తొలుత వైవీ సుబ్బారెడ్డి నోరు విప్పారు.

 

జగన్ మీడియా ముందు చెప్పిన మాటలనే ఆయన చెప్పినట్టు కనిపించింది. పైగా జగన్ ఆస్తుల కేసులో షర్మిలను ఇరికించే ప్రయత్నం చేశారాయన. ఈ వ్యవహారంలో నోరు విప్పిన ఇద్దరు నేతలు సైతం జగన్‌కు మద్దతుగా పలికారు. ఒకవేళ విజయసాయిరెడ్డి నోరు విప్పితే.. ఆయన కూడా ఆ నేతల బాటలో వెళ్లడం ఖాయమని అంటున్నారు.

 

గతంలోకి వెళ్దాం.. వైఎస్ఆర్ ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? దీనిపై ఈ స్థాయిలో రచ్చ జరుగుతున్నా ఎందుకు నోరు మెదపలేదు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత జగన్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత జగన్‌ను కేవీపీ నేరుగా కలిసిన సందర్భం లేదు.. రాలేదని కొందరు నేతలు చెబుతారు.

 

ఎవరైనా మీడియా మిత్రులు జగన్ గురించి అడిగినా సైలెంట్‌గా ఉండేవారు కేవీపీ. వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారంలో విజయమ్మతోపాటు కేవీపీకి అంతా తెలుసని అంటున్నారు. పైగా షర్మిల అభిమానులకు రాసిన లేఖలో కేవీపీ పేరు కూడా ప్రస్తావిస్తారు.

 

ఆస్తుల వ్యవహారంలో జగన్‌ను కేవీపీ ఎదురించే సాహసం చేస్తారా? షర్మిల-విజయమ్మకు న్యాయం చేస్తారా? జగన్‌తో ఢీ కొట్టడమంటే ఆశామాషీ విషయం కాదని చాలామంది నేతలు చెబుతున్నారు. లేదంటే సైలెంట్‌గా ఉండడమే బెటరని అంచనాకు వస్తారా? అన్నది అసలు పాయింట్.

 

మరో విషయం ఏంటంటే వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారంలో టాలీవుడ్‌లో అలనాటి స్టార్ హీరో బ్రదర్‌కు తెలుసని అంటున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మార్నింగ్ వాకింగ్ వేళ ఆస్తులపై చిన్నపాటి చర్చ జరిగిందట. ఆ సమయంలో వైఎస్ఆర్, విజయమ్మ, కేవీపీ, ఓ నిర్మాత ఉన్నారట. తన ఆస్తులు కొడుక్కి, కూతురికి సమానంగా ఇస్తున్నట్లు వైఎస్ఆర్ ఓపెన్‌గా చెప్పారట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్సీ.

Posted Under AP
Editor