హర్యానాలో ఓటమి.. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌..!

హర్యానా ఎన్నికల్లో అసలేం జరిగింది? దశాబ్దంపాటు ఒకే పార్టీ అధికారంలో మళ్లీ ఎలా కంటిన్యూ చేయగలిగింది? ప్రజల అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయిందా? హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో ఈ విషయం బయట పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

హర్యానా ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది. గురువారం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్‌మాకెన్‌తోపాటు హర్యానాకు చెందిన కొందరు నేతలు హాజరయ్యారు.

 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి గల కారణాలను గుర్తించేందు కు నేతలు తమతమ అభిప్రాయాలను బయటపెట్టారు. చాలామంది నేతలు ఈవీఎంల వ్యవహారాన్ని తప్పుబట్టారు. ప్రాంతాల వారీగా సేకరించిన వివరాలను దగ్గర పెట్టి హర్యానా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు అగ్రనేతలు.

 

ఓటమికి ప్రధాన కారణాల్లో తొలుత ముఠాతత్వం, రెండోది వ్యక్తి గత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కొందరి నేతలు ఓపెన్‌గా చెప్పారట. ఎవరి పట్టు కోసం వారు ప్రయత్నాలు చేశారని, దాన్ని ప్రత్యర్థి పార్టీలు ఉపయోగించుకున్నారని తెలిపారు. బీజేపీ విజయానికి ఆప్ కొంత తోడైందని అంటున్నారు.

 

అధికార పార్టీలో గ్రూపులు ఉన్నాయని వాళ్లు ఎలా అధిగమించారన్నది అసలు ప్రశ్న. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య రాలేదని, ఇక్కడే ఎందుకొచ్చిందని ఆ రాష్ట్రానికి చెందిన నేతలను అగ్రనేతలు ప్రశ్నించారట.

 

వీటిపై నిగ్గు తేల్చాలంటే నియోజకవర్గాల వారీగా ఎదురైన సమస్యలను తెలుసుకునేందుకు నిజ నిర్థారణ కమిటీని నియమించాలని నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో వెల్లడైన కారణాలతో కొందరి నేతలపై వేటు వేయడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు సీనియర్లు, ప్రతీ విషయాన్ని అగ్రనేతలు గమనిస్తున్నారని, తేడా వస్తే పక్కన పెట్టేయడం ఖాయమని అంటున్నారు.

Editor