జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్.. మా విధానం: చంద్రబాబు..

వరద బాధితులకు సాయం అందించిన విషయంలో కొంతమంది బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ వరదల్లో 28వ వార్డులో సాయం అందించడంపై గొడవను ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వార్డులోకి వరద నీళ్లు రాలేదని చెప్పారు. అయినప్పటికీ వారు కూడా కష్టాలను ఎదుర్కొన్నారనే మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం ప్యాకెట్లను అక్కడి ప్రజలకూ అందించామని చెప్పారు. దీనిపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. ప్రజలను ఎలా ఎడ్యుకేట్ చేయాలో తమకు తెలుసని చెప్పారు. వరద సాయం విషయంలో చాలామంది తనపై నమ్మకంతో విరాళం అందించారని తెలిపారు.

 

తనపై నమ్మకంతో, తామిచ్చే డబ్బు నిజమైన బాధితులకు చేరుతుందనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో దాతలు ముందుకొచ్చి తోచిన సాయం అందించారని చెప్పారు. తనపై నమ్మకంతో 400 కోట్ల రూపాయల విరాళం అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని వివరించారు. బాధితుల కోసం ఇచ్చిన విరాళం విషయంలో బాధ్యతతో వ్యవహరించకుంటే దాతల స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ విషయంలో అక్రమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని… వ్యక్తులైనా, సంస్థలైనా ఎవరైనా సరే అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఎవరైనా ఇప్పటికే అలాంటి పనులేమైనా చేసి ఉంటే తప్పు సరిదిద్దుకోవాలని, ఆ డబ్బు తిరిగివ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.

Posted Under AP
Editor