రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
అనంతపురం, జులై 27 :
జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
-ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక స్టాక్ యార్డు జుంజురాంపల్లి స్టాక్ యార్డు అని, ఇక్కడ దాదాపు 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ చేసే అవకాశం ఉండగా, ఇప్పటివరకు 16,226 మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయగా, స్టాక్ యార్డులో 41,934 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఉచిత ఇసుక కార్యక్రమం కింద ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, లోడింగ్ చార్జీలు మరియు రాయల్టీ (సీనరేజ్) చార్జీలు మొత్తం కలిపి ఒక మెట్రిక్ టన్ను ఇసుకను 195 రూపాయలకు అందిస్తున్నామన్నారు. ఇసుక పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుబాటులో ఉందని, ఇంటర్ స్టేట్ అందుబాటులో ఉండదన్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని తెలిపారు.
ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా మైన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉపయోగించడం జరుగుతోందని, ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని పత్తికొండ, శ్రీ సత్య సాయి జిల్లాలోని అమరాపురం వారు ఇసుకను తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. జిల్లాలో స్టాక్ యార్డులను, కొత్తగా ప్రతిపాదనలు పంపించిన ఇసుక రీచ్ లను తనిఖీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇసుక స్టాక్ నమోదు చేసే రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ వరకు ఇసుక సరఫరా చేస్తున్నారు, ఎంత బాడుగ వసూలు చేస్తున్నారు, ఇసుక నాణ్యతగా ఉందా, ప్రతిరోజు ఎన్ని లోడ్ లను పంపిస్తున్నారు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మైన్స్ డిడి నాగయ్య, సిఐ శ్రీనివాసులు, తహసీల్దార్ చిట్టిబాబు, మండల వ్యవసాయ అధికారి మహేంద్ర, పంచాయతీ సెక్రెటరీ అశోక్ కుమార్, విఆర్ఓ భీమప్ప, తదితరులు పాల్గొన్నారు.