వైసీపీ కవ్వింపు చర్యలు, జనసైనికులు జాగ్రత్త అంటూ…

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం అంచున ఉందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు జనసేన కేడర్. తాజాగా నాగబాబు పార్టీ కేడర్‌కు ఇస్తున్న సూచనలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పోలింగ్ రోజున ఏ విధంగా జరిగిందో చూశామని, ఫలితాల రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రియాక్ట్ కావద్దని సూచన చేశారు. ఉన్నట్లుండి నాగబాబు.. కేడర్‌కు ఎందుకు సూచన చేశారు? దాడుల విషయమై ఆ పార్టీకి ఏమైనా సంకేతాలు వచ్చేయా? ఇదే చర్చ జోరందుకుంది.

 

ఎన్నికల కౌంటింగ్‌కు ఐదు రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు తమతమ కార్యకర్తలను అలర్ట్ చేశాయి. ఓడిపోయిన పార్టీ కార్యకర్తలు ఆవేశంతో దాడులకు తెగబడే అవకాశముంది. ఎన్నికల పోలింగ్ రోజు పరిస్థితులను గమనించిన జనసేన నేత నాగబాబు, పనిలో పనిగా కార్యకర్తలను సూచన చేశారు. ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు.

 

కూటమి నేతలు, కార్యకర్తలు, జనసైనికులు, పిఠాపురం ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని, ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామం టూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని, పోలీసులు, ఈసీకి సహకరించారని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో నాగబాబు, ఈ విధంగా సూచన చేయలేదని అంటున్నారు.

 

10 రోజుల కిందట ఎన్నికల సంఘం కీలకమైన నియోజకవర్గాల్లో బలగాలు మోహరించింది. అధికార- విపక్ష కార్యకర్తల మధ్య దాడులు జరిగే అవకాశముందని భావించి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులను రంగంలోకి దింపింది. ఉమ్మడి గుంటూరు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, పిఠాపురం నియోకవర్గాల్లో గత ఎన్నికల సమయంలో దాడులు జరిగాయని అధికారులు గుర్తుచేశారు. ఈ క్రమంలో ముందుగా కేడర్‌ను నాగబాబు అప్రమత్తం చేశారని అంటున్నారు.

Editor