రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి 5 నెలలు అయినా సరే ఓటమిని ఒప్పుకోలేకపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించింది బీజేపీనే.. ఈ విషయం కేటీఆర్ కు గుర్తులేదా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుమార్తె లిక్కర్ మాఫియా కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు అడుగుతోంది అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం అయోమయంలో ఉందన్నారు.
గ్యారంటీల పేర్లతో గారడీలు చేసి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకున్నారుని ఆరోపించారు. ఇప్పుడేమో ఆగస్టు 15 కల్లా హామీలను అమలు చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు చేయనిది.. ఆ వెంటనే గ్యారెంటీలని అమలు చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆగస్టు 15 తర్వాత ప్రజలకు మొండిచేయి చూపిస్తారన్నారు. ఎన్నికల కోడ్ అయిపోగానే రుణమాఫీ చేయొచ్చు కదా.. దానికి అంత సమయం ఎందుకని ప్రశ్నించారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందువరుసలో ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించిన ఐదు సభల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ, అభ్యర్థులను ప్రకటించడంలోనూ బీజేపీ అందరికంటే ముందు ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు.