జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ఒంటరిగానే పోరాడుతున్నారు. చిత్ర పరిశ్రమ వ్యక్తిగానే కాకుండా తనకంటూ స్వశక్తితో ఏపీ ప్రజల కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా.. సరైన విజయం దక్కకున్నా రాజకీయాలను విడిచిపెట్టలేదు. అటు సినిమాల్లో సైతం రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు.అయితే జనసేనకు సినీ గ్లామర్ తక్కువ. గత ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ప్రచారం చేశారు. అటు తరువాత పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఇటీవల యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
రాజకీయాల్లో పవన్ రాణించాలని తెలుగు చిత్ర పరిశ్రమ ఆకాంక్షిస్తోంది. కానీ రాజకీయాల్లో నేరుగా పాల్గొనడానికి సినీ ప్రముఖులు ఇష్టపడడం లేదు. అయినా సరే కొంతమంది బాహటంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. మొన్న ఆ మధ్యన నిర్మాత పీవీపీ ప్రసాద్ పార్టీలో చేరారు.అదే సమయంలో చాలామంది సినీ ప్రముఖులు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి పవన్ అడ్డు చెప్పినట్లు టాక్ నడిచింది. అనవసరంగా ప్రభుత్వాలు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తాయని.. అందుకే పవన్ సమ్మతించలేదని ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండటంతో చాలామంది జనసేనలో చేరేందుకు ముందుకు వస్తుండడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా బుల్లితెర నటుడు సాగర్ అలియాస్ ఆర్కే స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. సోమవారం పవన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. దీనికి పవన్ అంగీకరించారు. దీంతో కండువా కప్పి ఆర్కెను ఆహ్వానించారు. ఆర్కే బుల్లితెరలు సుపరిచితుడు. మొగలిరేకులు సీరియల్ తో అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నారు. బుల్లితెర స్టార్ నటుడు అయ్యారు. అటువంటి వ్యక్తి జనసేన భావజాలాలు నచ్చి పార్టీలో చేరడంపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంతో ఆహ్వానం పలుకుతున్నారు