Latest Posts

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండవ విడత జాబితాతో రాష్ట్రంలో అనేక చోట్ల అసంతృప్తి సెగలు రగులుతున్నాయి.

తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నాయిని రాజేందర్ రెడ్డి కి టికెట్ కేటాయించారు. దీంతో జంగా రాఘవరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలతో, అనుచరులతో సమావేశమైన ఆయన త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడం పైన ఆయన కంటతడి పెట్టారు.ఇప్పటికే మునుగోడు టికెట్ దక్కకపోవడంతో చలమల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధం చేసుకుంటున్నారు. అదే బాటలో జంగా రాఘవరెడ్డి కూడా నడవనున్నారని సమాచారం.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకు అధిష్టానం కేటాయిస్తుందని భావించిన జంగా రాఘవరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించకుండా షాక్ ఇచ్చింది. దీంతో ఆయన హనుమకొండ జిల్లా తన మామిడి తోటలో రహస్య సమావేశం ఏర్పాటు చేసి అనుచరులతో చర్చించారు. జంగా రాఘవరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది.

జంగా రాఘవ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేసి తీరుతానని, వరంగల్ పశ్చిమ లో తనకు దాస్యం వినయ్ భాస్కర్ కు మధ్యనే పోటీ ఉంటుందని జంగా రాఘవరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ జంగా రాఘవరెడ్డి కూడా ఇండిపెండెంట్ గా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదు.

ఈ క్రమంలో అధిష్టానం జంగా రాఘవరెడ్డి ని శాంతింప చేయడానికి ఏం చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జంగా రాఘవరెడ్డి వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి అన్నట్టు కొనసాగుతున్న రగడ ముందు ముందు మరే మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

YES9 TV