తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలోనూ, మెడికల్ కళాశాలలో నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు .
మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల, డిగ్రీ కళాశాల,33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కెసిఆర్ వల్లే ములుగు జిల్లాగా ఏర్పడిందని, కొత్త మెడికల్ కళాశాల సాధ్యమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ లేకుంటే.. ములుగు జిల్లా వచ్చేదా? మెడికల్ కళాశాల వచ్చేదా? అని ప్రశ్నించిన ఆయన కెసిఆర్ వల్లే ములుగు కు అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయడానికి ములుగు జిల్లానే స్ఫూర్తి అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ములుగు గుత్తూరు తండాలో 12 ఇళ్ళు కాలిపోయిన నాటి ఘటనలను గుర్తు చేసిన మంత్రి హరీష్ రావు బిడ్డకు పెళ్లి చెయ్యలేక ఇబ్బంది పడుతున్న తండ్రికి నాడు కేసీఆర్ అండగా నిలిచారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఒకప్పుడు ములుగులో వైద్యులు ఉండటం గొప్ప విషయమని, కానీ ఇప్పుడు ములుగులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అత్యధిక డెలివరీలు చేసిన జిల్లాగా ములుగు ద్వితీయ స్థానంలో ఉందన్నారు. 83శాతం డెలివరీలు ములుగు ఆస్పత్రిలో కావటం విశేషమన్నారు.
ఎక్కువ డెలివరీలు చేసిన జిల్లాగా మొదటి స్థానంలో నారాయణ ఖేడ్ ఉందన్నారు. ఇది సంతోషదాయకం అన్నారు మంత్రి హరీష్ రావు. ములుగులో ఇప్పుడు 100 మంది డాక్టర్లు ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్ వల్ల నీట్ లో 2 లక్షలు ర్యాంక్ వచ్చిన వారికి మెడికల్ సీట్ వస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
