డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆలూరులో అనూహ్య పరిణామం..?

  • డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆలూరులో అనూహ్య పరిణామం..?
  • పోలీసుల బైక్ తాళాలు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు తీసుకెళ్లారా..?
  • వాహనం పోలీస్ స్టేషన్‌లోనే ఉంటే.. తాళాలపై చర్యలు ఎందుకు లేవు..?
  • రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాలేదా..?

ఆలూరు, జూలై 14:

కర్నూలు జిల్లా ఆలూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం (13-07-2026) రాత్రి సుమారు 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

స్థానికుల కథనం ప్రకారం, మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న కొందరిని పోలీసులు అడ్డుకుని వారి వాహనాల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు అక్కడే ఉన్న పోలీసు శాఖకు చెందిన ద్విచక్ర వాహనాల తాళాలను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటన అనంతరం మద్యం సేవించిన వ్యక్తుల ద్విచక్ర వాహనం మాత్రం ఆలూరు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం. అయితే, పోలీసుల వాహన తాళాలు తీసుకెళ్లినట్లు ప్రచారం ఎదుర్కొంటున్న వ్యక్తులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

అయితే నిజంగానే పోలీసుల వాహన తాళాలు తీసుకెళ్లారా..? తీసుకెళ్లి ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారా..? సంబంధిత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..? కేసు నమోదు చేయకపోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా..? రాజకీయ ఒత్తిళ్ల వల్లే చర్యలు ఆలస్యమవుతున్నాయా..? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆలూరు పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అసలు ఏం జరిగింది..? సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారంలో వాస్తవం ఎంత..? అనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ఈ ఘటనపై ఆలూరు పోలీసులు అధికారికంగా స్పందించి పూర్తి వివరాలు వెల్లడిస్తేనే అన్ని సందేహాలకు తెరపడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Posted Under AP
Editor