ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి–ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి–ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత బాధ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణమండపం లో ఓటర్ల జాబితా సవరణపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 68 శాతం మాత్రమే ఓటర్ల సవరణ జాబితా మ్యాపింగ్ జరిగిందని వివరించారు. మండలాలు, గ్రామాలు, వార్డు, పోలింగ్ బూతు వారీగా పూర్తయిన మ్యాపింగ్ వివరాలను, లోటుపాట్లను ఆయన ఈ సందర్భంగా సమావేశంలో సమగ్రంగా వివరించారు. తక్కువ మ్యాపింగ్ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇప్పుడు పని చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కూడా త్వరలో రాబోతున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకుండా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు అందుబాటులో ఉంటూ వారి సహకారంతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయించాలని సూచించారు.
ఇందులో ప్రధానంగా… 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి పేర్లను ఓటరు సవరణ జాబితాలో నమోదు చేయించాలన్నారు. అదే విధంగా మరణించిన వ్యక్తులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ఇంటి చిరునామా మారిన ఓటర్లు తమ ప్రస్తుత నివాస ప్రాంతానికి అనుగుణంగా ఓటరు నమోదు వివరాలను బదిలీ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్ల జాబితా పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా ప్రతి బూత్ పరిధిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి మిత్రపక్షాలైన బిజెపి, జనసేన పార్టీ నాయకులను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు రోజుకు కనీసం 50 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర ఓటర్ల వివరాలను బిఎల్వోలకు అందించే విధంగా సహకరించాలన్నారు. ప్రతి ఓటరు మ్యాపింగ్ పూర్తయ్యే వరకు అవసరమైతే మూడు, నాలుగు సార్లు అయినా బిఎల్ఓ లను వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్లాలని తెలియజేశారు. ఈ ప్రక్రియలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ఇంచార్జీ వసుంధర దేవి, పరిశీలకులు గుర్రప్ప, పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి,మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు, కాలవ సన్నన్న, వన్నారెడ్డి, క్లస్టరులు పోరాళ్ల పురుషోత్తం, వాల్మీకి సిద్ధప్ప, మారుతీ, కలేకుర్తి సుదర్శన్,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లీ రాజు, మాజీ చేనేత డైరెక్టర్ టoకశాల హనుమంతు, మాజీ కన్వీనర్ గిరిమల్లప్ప, బండి భారతి, ప్రశాంతి,బిటి రమేష్, అగ్రహారం కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor