యాప్ ద్వారా ఎరువుల పంపిణీ – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

తాడిమర్రి( yes9tv )యాప్ ద్వారా ఎరువుల పంపిణీ – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
తాడిమరి, జూన్ 10: తాడిమరి మండల రైతు సోదరులకు మండల వ్యవసాయ శాఖ ముఖ్య ప్రకటన విడుదల చేసింది. ఖరీఫ్–2026 సీజన్ నుండి రైతులకు ఎరువుల పంపిణీ పూర్తిగా ప్రభుత్వం సూచించిన ప్రత్యేక యాప్ ద్వారా నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.
మండలంలోని ఏ అధీకృత ఎరువుల డీలర్ వద్దకు వెళ్లినా, ఎరువుల కొనుగోలు–అమ్మకాల ప్రక్రియ యాప్ ద్వారానే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఎరువుల సరఫరాపై పూర్తి పారదర్శకత ఏర్పడి, ఎరువుల కొరత సమస్యకు అవకాశం ఉండదని తెలిపారు.
రైతులు తమకు అవసరమైన ఎరువుల వివరాలు, కొనుగోలు సమాచారం సంబంధిత యాప్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని చెప్పారు. రైతులు తమ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, ఇతర రైతుల పేర్లపై ఎరువులు కొనుగోలు చేయడం లేదా విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఏ రైతుకు ఎరువులు అవసరమైతే, ఆ రైతు స్వయంగా రైతు సేవా కేంద్రాలు లేదా అధీకృత ఎరువుల డీలర్ల ద్వారా మాత్రమే ఎరువులు పొందేందుకు అర్హులని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త విధానం వల్ల ఎరువుల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ఎరువుల కొరతపై వస్తున్న అపోహలను రైతులు నమ్మవద్దని, అవసరమైన సమయంలో యాప్ ద్వారా సులభంగా ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయాన్ని ఇతర రైతులకు కూడా తెలియజేసి అపోహలను తొలగించాలని కోరారు.
ప్రస్తుతం మండలంలో సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతు సేవా కేంద్రాలు మరియు అధీకృత ఎరువుల దుకాణాల్లో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన నిల్వలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఎరువులు అందించే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మండలంలోని ఎరువుల దుకాణాలను పరిశీలించి, నిల్వలు మరియు పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ ఆధారిత వ్యవస్థను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor